రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఉగ్రవాదులు పంజా విరసడంతో కేంద్ర హోం శాఖ దేశంలోని ముఖ్య నగరాల్లో హై అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ముఖ్య నగరాలతో పాటు.. తిరుమల, కాశీ వంటి పుణ్యక్షేత్రాల్లో సైతం భద్రతను అప్రమత్తం చేశారు.
ఉగ్రవాదులు జన సంచారం బాగా ఉన్న ప్రాంతాలను పేలుళ్లకు టార్గెట్‌గా ఎంచుకోవడంతో ఆయా నగరాల్లో కూడా అలాంటి ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా జైపూర్‌లో పేలిన బాంబు తరహాలోని బాంబులే గతంలో హైదరాబాద్ నగరంలో కూడా విధ్వంసం సృష్టించాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి ఉగ్రవాదులతో అక్కడ కూడా సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాక ఉగ్రవాద గ్రూపులు దేశంలో జాయింట్ ఆపరేషన్లు చేస్తూ పలు పట్టణాల్లో విధ్వంసాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికల్లోనూ, ఉగ్రవాదుల విచారణల్లోనూ బయటపడింది. నగరంలో కూడా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉండడంతో పోలీసులు సాధ్యమైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పేలుళ్ళకు అమ్మోనియం నైట్రేట్? జైపూర్‌లో అతి తక్కువ ఇంటెన్సిటీ కలిగిన బాంబులను పేల్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ బాంబుల తయారీలో అమ్మోనియం నైట్రేట్ ఆధారిత రసాయనాలతో పాటు సైకిల్ బాల్స్‌ను ఉపయోగించినట్టు సమాచారం. దీంతో తక్కువ ప్రభావం ఉండే రసాయనాలతో బాంబులు తయారు చేసినప్పటికీ నష్టం మాత్రం భారీగా ఉంటుంది. గతంలో హైదరాబాద్‌లోని లుంబినీ, గోకుల్‌ఛాట్ పేలుళ్ల ఘటనలో ఉపయోగించిన బాంబులు ఈ తరహాలోనే తయారుచేసినవి కావడం గమనార్హం.
అంతేకాకుండా ఈ పేలుళ్ళ సమయాన్ని కూడా హైదరాబాద్‌లో జరిగినట్టుగానే రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగాయి. జైపూర్ పేలుళ్లు రాత్రి 7.15-7.27 గంటల మధ్య సంభవించడం గమనార్హం. దీంతో ఈ పేలుళ్ళకు పాల్పడింది కూడా ఒకే ఉగ్రవాద గ్రూపునకు చెందిన వ్లాళుగా ఉంటారని పోలీసులు సందేహిస్తున్నారు.
|