కేంద్రంలోని యూపీఏ సర్కారు అనుసరిస్తున్న మెతక వైఖరి వల్లే దేశంలో తీవ్రవాదులు, ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. యూపీఏ విధానాలపై దుమ్మెత్తి పోశారు. యూపీఏ మిత్రపక్షాల మధ్య నెలకొన్న అభిప్రాయభేదాల కారణంగా దేశ పరిపాలన అస్తవ్యస్తంగా సాగుతోందని ఆరోపించారు.
ముఖ్యంగా ఉగ్రవాదం, దేశ అంతర్గత భద్రతపై యూపీఏ మెతక వైఖరి అవలంభిస్తోందని, దీనికి జైపూర్ వరుస పేలుళ్లే నిదర్శనమని రాజ్‌నాథ్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల ప్రచారంలో యూపీఏ ఇచ్చిన హామీలన్నీ బూటకమని, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తే పోటా చట్టాన్ని పునరుద్ధరిస్తామని ఆయన ప్రకటించారు.
ఇకపోతే ప్రత్యేక తెలంగాణా అంశంపై తెదేపా, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఒక్క భాజపాకే సాధ్యమన్నారు. ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) తమతో చేతులు కలిపే విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
|