చైనా భూకంప బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. బాధితుల కోసం ఐదు మిలియన్ డాలర్ల సాయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ఈ నిధులను బాధితులకు అవసరమైన దుప్పట్లు, గుడారాలు, మందులు, ఆహార పదార్థాలను కొనుగోలు చేసేందుకు ఉపయోగిస్తామని ఆ శాఖ ప్రకటించింది.
గత సోమవారం చైనాలోని పలు ప్రాంతాలను భారీ భూకంపం కుదిపేసిన విషయం తెల్సిందే. రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైన ఈ భూకంపం ప్రభావానికి పలు ప్రాంతాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. మృతులు 20 వేలకు పైగా ఉన్నారు. వేలాది మంది గాయపడ్డారు.
లక్షలాది మంది నిరారశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో చైనా భూకంప బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. కాగా, భూకంప సహాయ చర్యల్లో సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
|