'మీ కోసం' యాత్రలో నిమగ్నమైవున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు ఒకింత ఆందోళనకు లోనయ్యారు. బాబు అస్వస్థత కారణంగా 'మీ కోసం' యాత్రను సాయంత్రం వరకు వాయిదా వేశారు.
బాబు ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు కొద్ది రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే బాబు మాత్రం తాను చేపట్టిన యాత్రను కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారు. రాష్ట్ర పర్యటన కోసం చంద్రబాబు చేపట్టిన 'మీ కోసం' యాత్ర గురువారానికి 25 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ యాత్రలో ఇప్పటి వరకు ఆయన 2006 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇదిలావుండగా.. అస్వస్థతకు గురైన చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు పరామర్శించారు.
|