కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ ఆరోపించారు. ముఖ్యంగా తీవ్రవాదంపై జరుపుతున్న పోరులో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా ఓటమి చవిచూసిందని ఆయన ధ్వజమెత్తారు. దీనికి నిదర్శనమే దేశంలో తరచూ జరుగుతున్న బాంబు పేలుళ్ళు అని ఆయన వ్యాఖ్యానించారు.
శుక్రవారం దేశరాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలోకి విదేశీ తీవ్రవాదులు చొచ్చుకు వచ్చి విధ్వంస చర్యలకు పాల్పడుతున్నారని, ఇది ఆందోళన కలిగించే చర్యగా అద్వానీ పేర్కొన్నారు. తాజాగా అస్సోంలోని డీహెచ్‌డీ తీవ్రవాదులు 12 మందిని కాల్చి చంపడాన్ని ఆయన ఖండించారు.
ఈ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన అద్వానీ, ఇలాంటి సంఘటనలు దేశ, మానవాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు. ఈశాన్య భారతంలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదుల చర్యలను పీచమణిచేందుకు కాంగ్రెస్ సర్కారు మెతక వైఖరి అవలంభిస్తున్నారని అద్వానీ విమర్శించారు.
|