తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉందని ఆయన కుమారుడు, రాష్ట్ర స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి ఎంకే.స్టాలిన్ స్పష్టం చేశారు. చెన్నై నగర శివారు ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. నాన్నాగారి ఆరోగ్యంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉంది. సమాజ సామరస్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు పని కల్పించుకుని ఇలాంటి పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మెడ, వెన్ను నొప్పి కారణంగానే ఆయన ఆస్పత్రిలో చేరారని, కొద్ది రోజుల ఆస్పత్రిలోనే ఉండి, విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారని చెప్పారు. 84 సంవత్సరాల కరుణానిధి శుక్రవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు లోనుకావడంతో నగర శివారు ప్రాంతంలో ఉన్న శ్రీ రామచంద్రా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేరారు.
కాగా, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎం.కృష్ణస్వామి, డీకే అధ్యక్షుడు కె.వీరమణి, రాష్ట్రమంత్రులు స్వయంగా అస్పత్రికి వెళ్లి కరుణానిధి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే.. నగరంలోనే ఉన్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా వాకబు చేశారు. ఇదిలావుండగా.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.అన్బళగన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మెడ, వెన్ను నొప్పి కారణంగా పార్టీ అధ్యక్షుడు ఆస్పత్రిలో చేరారని, ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు పార్టీ కార్యకర్తలు గానీ, ప్రజలుగానీ ఎవరూ ఆటకం కలిగించరాదని తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. అధినేత ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యుల సూచన మేరకు ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు.
|