కమ్యూనిస్టు పార్టీ వృద్ధ నేత హరికిషన్ సింగ్ సూర్జీత్ ఆరోగ్యం మరింత విషమంగా మారింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యం పాలైన సూర్జీత్... నోయిడాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో శనివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన కోమాలోకి వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఇప్పటికే కృత్రిమశ్వాస పీల్చుకుంటున్న సూర్జీత్‌కు ప్రస్తుతం శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉందని వైద్యులు తెలిపారు. తాము చేస్తున్న వైద్య సేవలకు సూర్జీత్ సరిగా స్పందించడం లేదని వారు వెల్లడించారు. సూర్జీత్ ఇటీవలే ఛాతి ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న విషయం తెల్సిందే.
మళ్లీ ఆరోగ్యం విషమించడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 92 ఏళ్ల సూర్జీత్ అనారోగ్య కారణాల రీత్యా క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. గత ఏప్రిల్ నెలలో జరిగిన సీపీఎం పార్టీ 19 మహాసభలకు కూడా ఆయన హాజరుకాలేక పోయారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సూర్జీత్.. స్వాతంత్ర్య పోరాటంలో కూడా పనిచేశారు.
|