వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ మిత్రపక్షాలు సమైక్యంగా ప్రజా తీర్పును కోరుతాయని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చేతగాని ప్రధాని మన్మోహన్ అంటూ భారతీయ జనతా పార్టీ చేసిన ఆరోపణలను సోనియా కొట్టిపారేశారు.
ప్రధాని తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు అన్ని పార్టీల నేతలను సంతృప్తి పరుస్తున్నాయని, అలాగే అణు ఒప్పందం వ్యవహారంలో యూపీఏకు ప్రాణవాయువు లాంటి వామపక్షాలను సైతం ప్రధాని గట్టిగా హెచ్చరించిన విషయాన్ని సోనియా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక నివాసంలో మిత్రపక్ష నేతలకు విందు ఇచ్చారు.
ఈ సందర్భంగా గత నాలుగేళ్ళలో యూపీఏ సాధించిన విజయాలను, ప్రజలకు చేసిన అభివృద్ధి పనులతో కూడిన 'ప్రజలకు నివేదిక' అనే పేరుతో ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ఇదిలావుండగా ప్రధాని ఇచ్చిన విందుకు యూపీఏ నేతలతో పాటు, ఎస్పీ నేత అమర్ సింగ్, లెఫ్ట్ నేతలు సీతారాం ఏచూరీ, ఏబీ.బర్ధన్, బృందాకారత్, డి.రాజా తదితరులు హాజరయ్యారు.
అయితే వీరంతా 'ప్రజలకు నివేదిక' అనే కార్యక్రమానికి మాత్రం హాజరుకాలేదు. యూపీఏ సాధించిన విజయాలు తమకేమి పట్టనట్టుగా వ్యవహరించారు. సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండటంతో కాంగ్రెస్-ఎస్పీ పార్టీల స్నేహబంధానికి అమర్ సింగ్ రాక నాంది పలుకుతుందని యూపీఏ నేతలు అభిప్రాయపడ్డారు.
|