ఓ వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో భగ్గుమంటున్న చమురు ధరలు. మరోవైపు ఆహార సంక్షోభం. ఈ రెండు కారణాల రీత్యా దేశ ద్రవ్యోల్పణం రేటు ఎన్నడూ చూడనంతగా పెరిగిపోతోంది. దీంతో దేశ వ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం నాలుగు వసంతాలను పూర్తిచేసుకుంది.
ఈ సందర్భంగా ప్రధాని అధికారిక నివాసంలో యూపీఏ మిత్రులకు పసందైనా విందును ఇచ్చారు. ఈ విందులో ప్రధాని పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై మిత్రులతో పాటు దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ఈ ఏడాది రుతుపవనాలు, రబి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని ప్రభుత్వానికి నివేదికలు వస్తున్నాయి. అందువల్ల ద్రవ్యోల్బణం రేటు వచ్చే 8-10 వారాల్లో తిరిగి యధాస్థితికి చేరుకుంటుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అయితే అంతర్జాతీయంగా పెరిగిన ఆయిల్, స్టీల్, ఆహార ధాన్యాల ధరలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు చెప్పారు. మే నెల మూడో తేదీతో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 7.83 శాతానికి చేరుకున్న విషయం తెల్సిందే. దీంతో హోల్‌సేల్ ధరల సూచీ అమాంతం పెరిగడంతో వామపక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ధ్వజమెత్తాయి.
|