దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు ఈఎస్‌ఐ కార్పొరేషన్ డైరక్టర్ జనరల్ ప్రభాత్ సి.ఛతుర్వేది వెల్లడించారు. ఆయన గురువారం పుదుచ్చేరిలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసే వైద్య కళాశాలలు మెరుగైన వైద్య సేవలు అందిస్తాయని ఆయన తెలిపారు.
ప్రతి వైద్య కళాశాలలో 300 పడకలతో కూడిన ఆస్పత్రిని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉన్నట్టు చెప్పారు. మొత్తం 144 ఈఎస్‌ఐ ఆస్పత్రులను 300 పడకల సౌకర్యం కలిగిన 46 ఆస్పత్రులుగా మార్చనున్నట్టు చెప్పారు. వీటిని వైద్య కళాశాలలుగా మార్చుతామని ఆయన వివరించారు. పుదుచ్చేరిలో ఈఎస్‌ఐ కార్పొరేషన్ 75 పడకల ఆస్పత్రిని కలిగి వుందన్నారు.
తాజాగా కొత్త వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు 15 ఎకరాల స్థలాన్ని 19 సంవత్సరాల లీజుకు ఇచ్చారని ఛతుర్వేది వివరించారు. ఈఎస్‌ఐ కార్పొరేషన్‌లో కోటి మంది ఉద్యోగస్తులు, నాలుగు కోట్ల మంది సభ్యులు ఉన్నారని, వీరికి వైద్య సౌకర్యాలను అందిస్తున్నామన్నారు. ప్రజలకు సాధారణ రేట్లకు వైద్య సేవలు అందించే నిమిత్తం ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు.
|