భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ శుక్రవారం చారిత్రక పర్యటనకు శ్రీకారం చుట్టారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆమె జమ్మూ కాశ్మీర్‌కు శుక్రవారం ఉదయం చేరుకున్నారు. విమానశ్రయంలో దిగిన ఆమెకు ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) ఎస్కే.సిన్హా, ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, కేంద్ర నీటి పారుదల శాఖామంత్రి సైఫుద్దీన్ సౌజ్‌లు ఘన స్వాగతం పలికారు. విమానశ్రయం నుంచి నేరుగా ఆమె బారాముల్లా సరిహద్దు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ ఆమె కొద్ది సేపు జవాన్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆ తర్వాత శ్రీనగర్‌లోని షేర్-ఐ-కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్నాతకోత్సవంలో పాల్గొని కీలకోపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత 25వ తేదీన జమ్మూ రీజియన్‌లోని బదర్వాలో విశ్వవిద్యాలయ కాంప్లెక్స్‌ను ఆమె ప్రారంభిస్తారు. 26వ తేదీన షేర్-ఐ-కాశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఈ పర్యటన పూర్తయిన తర్వాత ప్రతిభా పాటిల్ జమ్మూ నుంచి నేరుగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళుతారు.
|