జమ్ముకాశ్మీర్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పిడిపి) మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ మాత్రం పూర్తికాలం కొనసాగుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీని సమావేశపరిచితే మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆజాద్ ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్.వోహ్రాకు సోమవారం ఒక లేఖ రాశారు.
రాష్ట్ర గవర్నర్ అసెంబ్లీని ఏ క్షణం సమావేశపరిచినా మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని, అందువల్ల ఎపుడైనా ప్రజాస్వామ్య విలువలకు పెద్దపీట వేస్తూ మెజారిటీని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ వ్యవహారంతో జమ్ముకాశ్మీర్ ప్రభుత్వానికి పిడిపి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది. దీంతో గులాం నబీ ఆజాద్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. రాష్ట్ర అసెంబ్లీకి మరో నాలుగు నెలల మాత్రమే గడువు వుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, పూర్తి కాలం అధికారంలో కొనసాగుతామని ఆజాద్ ప్రకటించారు.
|