ప్రతి ఏడాది అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సాగే అమర్‌నాథ్ యాత్ర ప్రశాంతంగా సాగుతోందని జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల వల్ల యాత్రకు ఎలాంటి అవాంతరాలు కలుగలేదని పేర్కొంది. స్థానిక ప్రజల పూర్తి సహాయ సహకారాలతో యాత్ర సాగుతోందని ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్య విద్యాశాఖామంత్రి మంగత్ రామ్ శర్మ చెప్పారు.
యాత్ర ప్రారంభమైన తేదీ (జూన్ 17వ తేది) నుంచి ఇప్పటి వరకు 3.76 లక్షల మంది యాత్రికులు పవిత్ర హిమలింగాన్ని దర్శనం చేసుకున్నారని, ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 వేల మంది ప్రజలు ఈ స్థలాన్ని సందర్శిస్తున్నారని ఆయన వివరించారు.
యాత్రికులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందని, ఈ చర్యల్లో శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుతో సహా, కొన్ని మత సంస్థలు పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు అటవీ భూములను కేటాయించిన వ్యవహారానాంతరం జరిగిన సంఘటనలపై ప్రజలు శాంతియుతంగా వుండాలని, ఈ సమస్యను ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, గవర్నర్ ఎన్ఎన్.వోహ్రాలు పరిష్కారిస్తారన్నారు.
|