భారీ వర్షం ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. మంగళవారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని పూర్తిగా జలమయమయ్యాయి. సాధారణ జన జీవనం అస్తవ్యస్తమైంది. పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలు స్తంభించి పోయాయి. దక్షిణ ముంబైలో 200 మిమి, ఇతర ప్రాంతాల్లో 149.9 మిమి చొప్పున వర్షపాతం నమోదైనట్టు స్థానిక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
భారీ వర్షం ధాటికి ముంబైలో ప్రధాన ప్రాంతాలైన బంద్రా, సియొన్, చెంబుర్, గాటక్‌పూర్ అంధేరి తదితర ప్రాంతాల్లోని నివాసిత గృహాల్లోకి వర్షపు నీరు చేరింది. అలాగే ముంబై-పూణే జాతీయ రహదారిలో వాహనరాకపోకలు నిలిచి పోయాయి. వర్ష బాధిత ప్రాంతాల్లో ముంబై కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచివున్న వర్షపు నీటిని సహాయక సిబ్బంది తొలగిస్తున్నారు.
భారీ వర్షం కారణంగా అనేక జాతీయ, అంతర్జాతీయ విమాన రాకపోకల్లో తీవ్ర అంతరాయం కలిగిందని ముంబై అంతర్జాతీయ విమానశ్రయ అధికార వర్గాలు వెల్లడించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లోని పాఠశాలలు మూసివేశారు. అయితే ఈ భారీ వర్షం పశ్చిమ మహారాష్ట్రలోని రైతులకు ఎంతో మేలు చేసింది.
వ్యవసాయ పనుల ప్రారంభానికి ఈ వర్షాలు ఎంతో దోహదపడతాయని ఆనందపడుతున్నారు. పశ్చిమ ముంబై, హార్బర్‌ల మధ్య నడిచే సబర్బన్ రైలు సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
|