ఈశాన్య రాష్ట్రాలపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ బుధవారం పథకాల వర్షం కురిపించారు. ఈశాన్య రాష్ట్రాలను కలుపుతూ రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి- విజన్ 2020 డాక్యుమెంట్‌ను ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈశాన్య రాష్ట్రాలు వెనుకబడి ఉండటానికి మౌలిక సదుపాయాల కొరతే ప్రధాన కారణమని ప్రధాని అన్నారు. 11వ పంచవర్ష ప్రణాళికలో రైలు, రోడ్లు మార్గాల అభివృద్ధికి రూ. 31,000 కోట్లను వెచ్చించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇటానగర్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాలకు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని మన్మోహన్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో విద్యుదీకరణకు రూ. 500 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాల్లో ఉదయించే సూర్యుడు మరింత ప్రజల్వించడానికి ఈ విజన్ డాక్యుమెంటును రూపొందించినట్లుగా ప్రధాని అభివర్ణించారు. షిల్లాంగ్ ప్రాంతాల్లో ఎన్టీఎఫ్‌టీ, ఐఐటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, వ్యవసాయ రంగాన్ని మరింత వృద్ధి చేయడం ద్వారా రెండో హరిత విప్లవానికి శ్రీకారం చుడుతామని ఆయన వెల్లడించారు.
|