యూఎన్‌పీఏ సమావేశంలో భాగంగా గురువారం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్‌తో సమావేశమయ్యారు. సీపీఐ నేత బర్దన్, సీతారాం ఏచూరీలతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా అణుఒప్పందంపై సరైన నిర్ణయం తీసుకునే దిశగా చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై కూడా వీరు చర్చించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, యూన్‌పీఏ కూటమిలో కీలక పాత్ర వహిస్తున్న సమాజ్ వాదీ పార్టీ యూపీఏకు మద్దతు ఇచ్చేందుకు సన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో, వామపక్ష నేతలతో బాబు భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే 2009 సాధారణ ఎన్నికల్లో తెదేపా వామపక్షాలతో పొత్తు పెట్టుకునే విషయంపై కూడా చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీ నేతలు ఎర్రం నాయుడు, రామ్మోహన్ రావులు కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా, యూఎన్‌పీఏ సమావేశంలో పాల్గొనేందుకుగానూ, తెదేపా అధినేత చంద్రబాబు "మీకోసం" యాత్రకు ఒకరోజు బ్రేక్ ఇచ్చి, గురువారం న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. అణుఒప్పందంపై యూపీఏ ప్రభుత్వం పురోగతి సాధించినట్లైతే వామపక్షాలు కేంద్రంలో ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడం ఖాయమని వదంతులు వెలువెత్తుతున్న విషయం తెలిసిందే.
|