కీలకమైన అణుఒప్పందంపై జాతీయ చర్చ జరగాల్సిన అవసరముందని ఐక్య జాతీయ కూటమి అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా యుఎన్‌పిఎ కూటమి ఏ చర్యనూ చేపట్టదని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
గురువారం సాయంత్రం అణుఒప్పందంపై కీలక సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన యుఎన్‌పిఎ నేతలు తామంతా ఐక్యంగా ఉన్నామని నమ్మబలికారు. ములాయం, అమర్‌సింగ్, చంద్రబాబు, చౌతాలా వంటి కూటమి నేతలు వరుసగా ప్రెస్ సమావేశంలో మాట్లాడినా ఒకరి తర్వాత ఒకరుగా అవే మాటలను తమ తమ యాసతో వల్లె వేయడం విశేషం.
యుఎన్‌పిఎ కూటమి జాతీయ ప్రయోజనాలకు ఎలాంటి చర్యా చేపట్టదని సమాజ్‌వాదీ పార్టీ ఛైర్మన్ ములాయం స్పష్టం చేశారు. అణు ఒప్పందం విషయంలో జాతీయ చర్చ జరగాలని, ఈ ఒప్పదంపై తమ కూటమి పూర్తిస్థాయిలో చర్చించనుందని పేర్కొన్నారు. గురువారం కూటమి సమావేశం అనంతరం విలేఖరుల సమావేశంలో పాల్గొన్న ములాయం తాము మత తత్వ శక్తులకు ఏ పరిస్థితుల్లోనూ మద్దతివ్వబోవని తేల్చి చెప్పారు.
ధరల పెరుగుదలపై ద్రవ్యోల్బణంపై యుపిఎ పట్ల తమ కూటమి వ్యతిరేకవైఖరి ఇప్పటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు. అన్నిటికంటే మించి యుఎన్‌పిఎ కూటమి ఐక్యంగా ఉందని, తమలో ఎలాంటి అభిప్రాయభేదాలు లేవని ములాయం స్పష్టం చేశారు. ఎస్పీ నేత అమర్‌సింగ్ మాట్లాడుతూ దేశ భద్రతకు కీలకమైన అణు ఒప్పదంపై తమకున్న సందేహాలను తీర్చాలని ప్రధానిని కోరామని ఆయన ఆ పని చేశారని పేర్కొన్నారు
యుఎన్‌పిఎలో మరో ముఖ్యనేత చౌతాలా మాట్లాడుతూ తమ కూటమి అటు బీజేపి ఇటు వామపక్షాలు రెండింటితో కలిసి నడవబోమని ప్రకటించారు. అణుఒప్పందంపై సందేహాలను తీర్చమని కోరి అమర్ సింగ్ మంచి పని చేశారని ప్రశంసించారు. అణు ఒప్పందం విషయంలో డాక్టర్ కలాంతో తాము సంప్రదిస్తామని చౌతాలా ముక్తాయించారు.
కాగా, యుపిఎ కూటమి కార్యదర్శి చంద్రబాబు నాయుడు చివరగా మాట్లాడుతూ అణుఒప్పందంపై జాతీయ చర్చ జరపాల్సిన బాధ్యత ప్రధానిపైనే ఉందని, పార్లమెంటుకు బయట అణుఒప్పందంపై జాతీయ చర్చ నిర్వహించాలని తాము ప్రధానిని అభ్యర్థిస్తున్నామని చెప్పారు. గురువారం సాయంత్రం చంద్రబాబు వామపక్ష నేతలు ప్రకాష్ కారత్, బర్దన్‌లతో భేటీ కానున్న యుఎన్‌పిఎ అంతిమ వైఖరిపై ఉత్కంఠత ఇంకా కొనసాగుతోంది.
|