కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్-అమెరికా అణు ఒప్పందానికి మద్దతు ఇస్తామన్నారు. పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగిన పక్షంలో అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో తమ పార్టీలో రెబల్ ఎంపీలు లేరన్నారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, అందరం కలిసే ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తమ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వీరింతా అణు ఒప్పందానికి మద్దతు తెలిపారని వివరించారు. అణు ఒప్పందంపై నిపుణులతో చర్చించామని, వారు కూడా ఒప్పందం వల్ల ఎలాంటి హానిలేదని భరోసా ఇచ్చారని ములాయం తెలిపారు.
అదేసమయంలో యూపీఏకు ఇస్తున్న మద్దతును లెఫ్ట్ పార్టీలు అంత సులభంగా ఉపసంహరించుకోబోవని ములాయం వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే వామపక్షాలు మాత్రం యూపీఏతో బంధం తెగిపోయిందని, బుధవారం రాష్ట్రపతిని కలిసి మద్దతు ఉపసంహరణ లేఖను అందజేయనున్నట్టు లెఫ్ట్ నేతలు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వెలువడిన కొద్ది సేపటికే ములాయం సింగ్ పై విధంగా వ్యాఖ్యానించడంలో గల ఆంతర్యమేమిటనేది అంతుచిక్కడం లేదు.
|