ఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించిన సదస్సుకు ఆ పార్టీకి చెందిన ఎంపీలు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. దీనితో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆందోళనలో ఉన్నారు. పార్టీ లోక్‌సభ సభ్యుల కోసం సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
లోక్‌సభ సభ్యులను ఉద్దేశించి ఎస్పీ పార్టీ జనరల్ సెక్రటరీ అమర్ సింగ్ ప్రసంగించారు. ఉదయం పూట జరిగిన సదస్సుకు పార్టీకి ఉన్న మొత్తం 39 మంది సభ్యులలో 16 మంది మాత్రమే హాజరయ్యారని వార్తలు వస్తున్నాయి. జులై 22వ తేదీన జరిగే బలపరీక్షలో యూపీఏకు వెన్నుదన్నుగా నిలుస్తుందన్న ఎస్పీ సభ్యులు చాలామంది ఈ సదస్సుకు హాజరుకాకపోవడం పార్టీ అగ్రనేతను ఆందోళనకు గురిచేసింది.
సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీలు అతీక్ అహ్మద్, అఫ్జల్ అన్సారీలు జైలులో ఉండగా, రాజ్ బబ్బర్, బేనీ ప్రసాద్ వర్మలను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీకే చెందిన మునావర్ హసన్ బలపరీక్షలో యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని గతంలో ప్రకటించి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాడు. మునావర్‌ను తిరుగుబాటుగా నేతగా పార్టీ ముద్ర వేసింది.
మునావర్ కులానికే చెందిన హమీరిపూర్ ఎంపీ రాజ్‌నారాయణ్ బుధోలియా, మోహన్‌లాల్‌గంజ్ ఎంపీ జై ప్రకాష్‌లు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఎస్పీ పార్లమెంటరీ పార్టీ గతంలో నిర్వహించిన సదస్సుకు కీర్తి వర్ధన్ సింగ్, మోహన్ సింగ్, రేవతీ రమణ్ సింగ్‌లు హాజరు కాలేదు. సమాజ్‌వాదీ పార్టీ తమ లోక్‌సభ్యులకు ఇటీవలే విప్ జారీచేసింది.
|