లోక్‌సభలో వెలుగుచూసిన డబ్బు సంచుల వ్యవహారానికి సంబంధించి ప్రధాని మన్మోహన్ సింగ్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీతో సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సాయంత్రం ఆరు గంటలకు స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ సభా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ప్రధాని సమాధానం ఇస్తారని తెలిపారు. వెంటనే ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు లేచి, మన్మోహన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను మరో మారు వాయిదా వేశారు. సాయంత్రం 6.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని, 7.15 నిమిషాలకు విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరుగుతుందని సోమనాథ్ ప్రకటించారు. 6.30 గంటలకు సభ ప్రారంభంకాగానే ప్రధాని మన్మోహన్ సింగ్ సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
|