పార్టీ ఆదేశాలను బేఖాతరు చేసిన లోక్‌సభ స్పీకరు సోమనాథ్ ఛటర్జీపై సీపీఎం బహిష్కరణ వేటు వేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో పావులు కదుపుతోంది. సోమనాథ్‌పై చర్య తీసుకునేందుకు ఆమోదం తెలుపాల్సిందిగా కేంద్ర కమిటీకి విజ్ఞప్తి చేసినట్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. కాగా, సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశం బుధవారం జరుగనుంది.
ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా సోమనాథ్‌కు ఎలాంటి ఆహ్వాన పత్రం అందలేదు. ఇదిలావుండగా తన భవితవ్యంపై స్పీకర్ స్పందిస్తూ తాను పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడుని కాదని, అందువల్ల తనకు షోకాజ్ నోటీసు ఇవ్వజాలదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో బుధవారం జరుగనున్న పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు.
అయితే తన రాజీనామా విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. యూపీఏకు ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత స్పీకర్ తన పదవి నుంచి వైదొలుగుతారని అందరూ భావించారు. ఇందుకు ఆయన ససేమిరా అన్నారు. దీంతో సీపీఎం ఆయనపై పలు రకాల ఒత్తిళ్లు చేసింది. అయినప్పటికీ వాటిని ఆయన తోసిరాజని, స్పీకర్‌గా కొనసాగుతున్నారు.
|