యూపీ సీఎం, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో తృతీయ కూటమికి చెందిన నేతలు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీలో బీఎస్పీ నేతలతో సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్, సీపీఐ నేత బర్ధన్, రాజా, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, తెరాస అధ్యక్షుడు కేసీఆర్, ఐఎన్‌డీఎల్ అధినేత చౌతాలా, ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు అజిత్ సింగ్, జేడీయు సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరులు హాజరయ్యారు. మహా కూటమి ఏర్పాటుపై వీరంతా ముమ్మరంగా చర్చలు జరుపనున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు మీడియాతో మాట్లాడుతూ... భవిష్యత్‌లో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి పనిచేస్తామని అన్నారు. బీఎస్పీతో కలిసి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తాము కృషి చేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో కొద్దిసేపు మాత్రమే పాల్గొన్న కేసీఆర్ అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు.
ఇకపోతే లోక్‌సభలో యూపీఏ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో భాగంగా చోటు చేసుకున్న పరిణామాలపై భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తెదేపా భావిస్తోంది. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ అంశంపై కూటమి భేటీలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
|