కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్టు వాపక్షాలు, యూఎన్‌పీఏ, బీఎస్పీ పార్టీలు ప్రకటించాయి. భారత్-అమెరికా అణు ఒప్పందం, ధరల పెరుగుదల, విశ్వాస పరీక్షలో అనైతిక విజయం తదితర అంశాలపై ఈ ఆందోళన సాగుతుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి నేతృత్వంలో యూఎన్‌పీఏ, వామపక్షాలకు చెందిన నేతలు తమ భవిష్యత్ ప్రణాళికపై బుధవారం దేశ రాజధానిలో సమావేశమయ్యారు.
సమావేశానంతరం బీస్పీ అధినేత్రి మాయావతి మీడియాతో మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ధ్వజమెత్తారు. మంగళవారం లోక్‌సభలో జరిగిన పరిణామాలు పూర్తి అనైతికమని ఆమె ఆరోపించారు. అలాగే సమావేశంలో చర్చించిన విషయాలను సీపీఎం అగ్రనేత ప్రకాష్ కారత్ ఒక ప్రకటనలో చదివి వినిపించారు. మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో యూపీఏ ప్రభుత్వం విజయం సాధించి ఉండవచ్చు. అయితే ఈ అనైతిక విజయంతో దేశ ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందన్నారు.
కేంద్రంలోని ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నైతిక విలువులను పూర్తిగా కోల్పోయింది. అందువల్ల ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఆందోళన సాగించాలని అన్ని రాజకీయ పార్టీలు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ జాతీయ స్థాయి ఆందోళనల్లో యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా, అన్ని సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళతామని కారత్ వెల్లడించారు.
ఈ సమావేశంలో బీఎస్పీ, తెదేపా, ఫార్వార్డ్ బ్లాక్, ఆర్‌ఎప్సీ, జనతాదళ్ (యు), ఆర్.ఎల్.డి, ఐ.ఎన్.ఎల్.డి. సీపీఐ, సీపీఎం, తెరాస పార్టీలకు చెందిన అగ్రనేతలు పాల్గొన్నారు. తమ ఆందోళన ప్రధానంగా ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, వ్యవసాయ ఉత్పత్తుల కొరత, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలపై సాగుతుందన్నారు. అణు ఒప్పందానికి, మతవాద శక్తులకు, అధికార దుర్వినియోగానికి కూడా తాము వ్యతిరేకమని కారత్ ప్రకటించారు.
|