భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొరఢా ఝుళిపించింది. యూపీఏకు మద్దతు తెలిపిన ఎనిమిది మంది ఎంపీలపై వేటు వేసింది. వీరిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత రాజ్‌నాథ్ సింగ్ బుధవారం తెలిపారు. అలాగే నగదు ఎర చూపినా లొంగని ముగ్గురు ఎంపీలను అభినందించారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది విప్‌ను ధిక్కరించినట్టు చెప్పారు.
వీరిలో ముగ్గురు సభకు హాజరు కాలేదని, మరో నలుగురు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని, ఒక సభ్యుడు సభకు హాజరైనా, ఓటింగ్‌లో పాల్గొనలేదని ఆయన వివరించారు. అందువల్ల వీరిని బహిష్కరిస్తునట్టు చెప్పారు. బహిష్కరణ వేటు వేసిన వారిలో కర్ణాటకకు చెందిన ముగ్గురు ఎంపీలు ఉన్నారు.
వీరిలో ధార్వాడ్ లోక్‌సభ సభ్యుడు కె.మంజునాథ్, హెచ్.టి.సాంగ్లియానా (బెంగుళూరు-ఉత్తరం), మనోరమా మద్వరాజ్ (ఉడిపి)లు ఉన్నారు. మిగిలిన ఐదుగురు సభ్యులలో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ (బల్‌రామ్‌పూర్), చంద్రభాన్ సింగ్ (దమోహ్), హరిభావ్ మాధవ్ (జల్గాన్), బాబూభాయ్ కటారా (దోహాడ్), సోంభాయ్ పటేల్ (సురేంద్ర నగర్)లు ఉన్నారు.
|