అనుకున్నట్టుగానే సీపీఎం పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ విప్‌ను ధిక్కరించినందుకు లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీపై బహిష్కరణ వేటు వేసింది. ఈ మేరకు సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సభ్యుడు బిమన్ బోస్ విలేకరులకు వెల్లడించారు.
పార్టీ విప్‌ను ధిక్కరించి స్పీకర్‌గా విధులు నిర్వహించడం పట్ల సీపీఎం అగ్రనాయకత్వం తీవ్రంగా మండిపడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి యధావిధిగా విధులు నిర్వహించిన సోమనాథ్‌పై చర్య తీసుకునేందుకు పార్టీ పొలిట్‌బ్యూరో బుధవారం దేశ రాజధానిలో సమావేశమైంది.
గత కొన్ని రోజులుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఆయనపై బహిష్కరణ వేటు వేస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. దీనిపై బిమన్ బోస్ మాట్లాడుతూ.. విశ్వాస పరీక్ష అనంతరం తన పదవి నుంచి తప్పుకుంటానని స్పీకర్ చెప్పారు. అప్పటి వరకు పార్టీ వేచి చూసింది.
మంగళవారం విశ్వాస పరీక్షాసమయం ముగిసింది. అయినప్పటికీ ఆయన పదవిలోనే కొనసాగుతున్నారు. ఇది పార్టీ క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించినట్టేనని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సోమనాథ్ బహిష్కరణ వేటు వేయాలని పార్టీ పొలిట్‌బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఇదిలావుండగా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. సోమనాథ్ సీపీఎం పార్టీ స్పీకర్ కాదు. ఆయన మంచి స్పీకర్. ఖచ్చితంగా ఆయన ఆ పదవిలో కొనసాగాలని కోరారు. సీపీఎం పొలిట్‌బ్యూరో నిర్ణయం పట్ల మాజీ అటార్నీ జనరల్ సోలీ సొరాబ్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 79 సంవత్సరాల సోమనాథ్.. నాలుగు దశాబ్దాలుగా సీపీఎం సభ్యునిగా కొనసాగుతున్నారు. గత 1996లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును సైతం సొంతం చేసుకున్న ఆయనకు వివాదరహితుడనే పేరుంది.
స్పీకర్‌గా కొనసాగవచ్చు.. పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం ఆయన లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగవచ్చు. ఆయను తొలగించే అధికారం కేవలం లోక్‌సభ సభ్యులకు మాత్రమే ఉంది. వంద మంది సభ్యులు కలసి ముందుగా నోటీసు ఇవ్వాలి. దీనిపై ఓటింగ్‌ను చేపడుతారు. ఇందులో మూడింట రెండో వంతు మెజారిటీ లభిస్తేనే స్పీకర్‌ను తొలగించేందుకు వీలుంటుంది.
|