కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వివిధ రంగాల్లో సంస్కరణలను వేగిరం చేస్తుందని కేంద్ర ఆర్ధిక మంత్రి పి.చిదంబరం చెప్పారు. ఇందులో భాగంగా ఇతర బిల్లులతో పాటుగా బీమా రంగంపై దృష్టిపెడతామన్నారు. బీమా బిల్లు చాలా కాలం నుంచి పరిష్కారానికి నోచుకోకుండా దూరంగా ఉందన్నారు.
పార్లమెంట్‌లో అనేక బిల్లులు ఆమోదం కోసం లోక్‌సభ సభ్యుల తీసుకుంటామన్నారు. లోక్‌సభలో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో తమ ప్రభుత్వం గట్టెక్కుతుందని ముందుగానే ఊహించిందని తెలిపారు. ఈ విజయం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వివరించారు.
బీమా బిల్లులో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను 49 శాతానికి పెంచుతామన్నారు. ప్రస్తుతం ఇది 26 శాతంగా ఉందని వివరించారు. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసిందని చిదంబరం వెల్లడించారు.
పార్లమెంట్‌లో మంగళవారం జరిగిన విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) 275 ఓట్లు సాధించి జయభేరి మోగించింది. ఇతర పార్టీల నుంచి చీలిన ఓట్లు వీరికి పడటంతో యూపీఏ విజయం తేలికైంది. భారత పార్లమెంట్ దిగువ సభ లోక్‌సభలో మొత్తం 545 మంది సభ్యులున్నారు. ఓటింగ్‌లో యూపీఏకు 275, ప్రతిపక్షాలకు 256 ఓట్లు పడ్డాయి.
|