కష్టకాలంలో ఆపద్భాంధవుడిలా ఆదుకున్న సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, తమ భవిష్యత్ ప్రణాళికపై కాంగ్రెస్ నేతలతో చర్చలు ప్రారంభించనున్నారు. ఒకనాడు బద్ధశత్రువులుగా ఉండి కష్టకాలంలో ఒకటైన ఈ రెండు పార్టీల నేతలు.. తమ పొత్తును భవిష్యత్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇరు పార్టీలకు చెందిన నేతలు త్వరలోనే చర్చలు ప్రారంభిస్తారు.
దీనిపై ఎస్పీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికల నిమిత్తం కాంగ్రెస్-ఎస్పీల మధ్య పొత్తుపై చర్చలు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఈ పొత్తు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ ఉంటుందన్నారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునేందుకు చర్చలు ఇప్పటికే ప్రారంభమైనట్టు ఎస్పీ వర్గాలు వెల్లడించాయి.
వచ్చే నవంబరు-డిసెంబరు నెలల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. 2003 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ పార్టీ ఏడు సీట్లతో బోణీ చేసింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి మద్దతు ఇవ్వడమే కాకుండా.. తన సొంత బలాన్ని కూడా మరింత మెరుగుపరుచుకోవడమే ధ్యేయంగా ఎస్పీ నేతలు పావులు కదపుతున్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 38 సీట్లకే పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ చేతిలో కాంగ్రెస్ పార్టీ ఖంగుతింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.
|