అమర్‌నాథ్ ఆలయ భూముల కేటాయింపు రద్దు వ్యవహారం జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి నిద్దుర లేకుండా చేస్తోంది. ఆలయానికి తిరిగి భూములను కేటాయించాల్సిందేనని ఆ రాష్ట్రంలోని హిందూ సంస్థలు గత పక్షం రోజులుగా ఆందోళన బాటలో నడుస్తున్నాయి. ఈ సమస్య ఇప్పటికిపుడు ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇది కేంద్రానికి తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రధాని మన్మోహన్ సింగ్ నడుంబిగించారు. దేశ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలతో ఆయన బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించడమే కాకుండా సమస్యకు స్వస్తి పలికే విషయంపై మార్గాలను అంశాలను పరిశీలిస్తారు.
జమ్మూకాశ్మీర్‌లోని అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు గత కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అటవీ భూములను కేటాయించింది. దీనికి ముస్లిం సంస్థలతో సహా కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో సంకీర్ణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయానికి హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జమ్మూలో గత పక్షం రోజులుగా బంద్ పాటిస్తున్నారు.
ఆందోళనకారుల ఆగ్రహం, సాయుధ పోలీసుల బలగాలు కాల్పులు, కర్ఫ్యూలతో జమ్మూ అట్టడుకి పోతోంది. సాధారణ జనజీవనం స్తంభించి పోయింది. ప్రస్తుతం జమ్మూలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. ఇందులోభాగంగా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది.
ఇందులో అన్ని జాతీయ పార్టీలతో సహా నేషనల్ కాన్ఫెరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించారు. ప్రధాని అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, వామపక్ష అగ్రనేతలతో సహా కీలక పార్టీల నేతలు హాజరుకానున్నారు.
|