భారత్-అమెరికాల మధ్య కుదుర్చుకున్న అణుఒప్పందంతో దేశానికి కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. పేదరిక నిర్మూలనకు, మౌలిక వసతుల కల్పనకు, ఆర్థికవృద్ధికి ఒప్పందం దోహద పడుతుందని రాహుల్ వెల్లడించారు.
కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు బుధవారం జరిగిన ఓ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అణుఒప్పందాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు పురోగమించాలని పేర్కొన్నారు. విద్యా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగమించిన భారత్ అణురంగంలో మాత్రం ఎందుకు ముందంజ వేయకూడదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.
సాంకేతిక పరిజ్ఞానం ఫలితాన్ని స్వల్ప కాల వ్యవధిలో అంచనా వేయలేమని రాహుల్ గుర్తు చేశారు. ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం మాట్లాడుతూ... ద్రవ్యోల్బణం అదుపుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, రిజర్వ్ బ్యాంక్ కూడా కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇంకా ఈ సదస్సులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
|