అమర్‌నాథ్ ఆలయ భూకేటాయింపు రద్దు వ్యవహారాన్ని పరిష్కరించేందుకుగాను నలుగురితో కూడిన కొత్త బృందాన్ని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్. వోహ్రా నియమించారు. అమర్‌నాథ్ ఆలయ భూముల కేటాయింపు రద్దు వ్యవహారం జమ్మూకాశ్మీర్ అధికార యంత్రాంగానికి నిద్దుర లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో... ఆలయానికి తిరిగి భూములను కేటాయించాల్సిందేనని ఆ రాష్ట్రంలోని హిందూ సంస్థలు గత పక్షం రోజులుగా ఆందోళన బాటలో నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ సమస్యను కొలిక్కి తెచ్చేందుకు గవర్నర్ నియమించిన ఈ కమిటీలో జేకే ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎస్.ఎస్.బ్లోరియా, జమ్మూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అమితాద్ మాట్టో, జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్ జీడి.శర్మ, అమర్‌నాథ్ ఆలయ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిబి.వ్యాస్‌లు ఉన్నారు. ఈ కమిటీ ఆందోళనాకారులతో చర్చలు జరుపుతుంది. గతంలో ముఖాముఖి చర్చలకు ఎస్ఎఎస్ఎస్ కమిటీ సభ్యులను రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించగా, అందుకు వారు నిరాకరించిన విషయం తెల్సిందే.
ఈ అంశంపై ఎస్ఎఎస్ఎస్ కన్వీనర్ లీలా కరన్ శర్మ మాట్లాడుతూ... అమర్‌నాథ్ భూ కేటాయింపు వ్యవహారంపై ప్రత్యేక బృందం జమ్మూ ప్రజల విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరిస్తోందని చెప్పారు.
ఇదిలా ఉండగా, అమర్‌నాథ్ సమస్య పరిష్కారానికి ప్రధాని మన్మోహన్ సింగ్ నడుంబిగించారు. దేశ రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలతో ఆయన బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించడమే కాకుండా సమస్యకు స్వస్తి పలికే మార్గాలపై అగ్రనేతలు చర్చలు జరిపారు.
ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, యూపీఏ అగ్రనేతలు, జమ్మూ రాష్ట్ర ముఖ్యమంత్రి గులాం నబి ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
|