రాష్ట్రంలో కొనసాగుతున్న రాజీనామాల పరంపర ప్రస్తుతం కేంద్రం వరకూ పాకింది. ఇందులో భాగంగా శుక్రవారం ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) ఛైర్మన్ పదవికి సి. రంగరాజన్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే అందుకు తగిన కారణాలను వెల్లడించేందుకు నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, ప్లానింగ్ కమిషన్‌లో సభ్యుడిగా కూడా పనిచేసిన రంగరాజన్, 1992-97 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు.
మరోవైపు, ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు ఇక అధ్యాపకుడి అవతారమెత్తేందుకు సిద్ధమయ్యారు. ఆయన సింగపూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఆసియన్ స్టడీస్ లీకువాన్‌యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ సంస్థల్లో పనిచేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సింగపూర్ బయలు దేరనున్నారు.
2004 నుంచి తనకు మీడియా సలహా దారుగా పనిచేసిన సంజయ్‌కు గురువారం ప్రధాని వీడ్కోలు విందునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, బిమల్ జలాన్, ఈఏసీ ఛైర్మన్ రంగరాజన్ కూడా హాజరయ్యారు. అయితే శుక్రవారం ఉన్నట్టుండి రంగరాజన్ తన పదవికి రాజీనామా చేసే కారణాలు తెలియరాలేదు.
|