సీపీఎం నుంచి బహిష్కరించబడిన లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ తిరిగి ఆ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీపీఎం పార్టీలో తిరిగి చేరేందుకు తానెలాంటి ప్రయత్నాలు చేయడం లేదని, పదవీ కాలం ముగిసిన తర్వాత రాజకీయాలకు స్వస్తి చెబుతానని ఛటర్జీ వెల్లడించారు.
కామన్వెల్త్ పార్లమెంటరీ సంఘం 54 సమావేశాల కోసం భారత పార్లమెంట్ ప్రతినిధుల బృందంతో శుక్రవారం ఛటర్జీ కౌలాలంపూర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పార్టీ ఆహ్వానించినట్లైతే సీపీఎంలో చేరుతారా అనే ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు.
సీపీఎం సభ్యుడిగా ఉన్నందుకు గర్వపడ్డానని, అయితే పార్టీ నుంచి తనను బహిష్కరించిన రోజు తన జీవితంలోనే దుర్దినంగా భావించినట్లు ఛటర్జీ వెలిబుచ్చారు. యూపీఏ విశ్వాస పరీక్షల్లో భాగంగా స్పీకర్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా సీపీఎం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని రాజీనామా చేసేది లేదని ఛటర్జీ స్పష్టం చేయడంతో సీపీఎం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది.
|