పూంచ్ పట్టణంలో శుక్రవారం ఉదయం హిందూ-ముస్లింల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చోటుచేసుకోవడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు కర్ఫ్యూ విధించారు. కాశ్మీర్ లోయలో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండటంతో సైనికులు రంగంలోకి దిగారు. అమర్‌నాథ్ భూముల కేటాయింపుకు వ్యతిరేకంగా, అనుకూలంగా నినాదాలు చేస్తూ హిందువులు-ముస్లింలు ఒకరి ప్రార్థనా స్థలాలపై మరొకరు రాళ్ళు రువ్వుకున్నారు.
గురువారం రాత్రి నుంచే ఇరువర్గాల వారు వీధుల్లోకి ప్రవేశించి పోటాపోటీగా ప్రదర్శనలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఆందోళన కారులను అదుపులోకి తీసుకోవడం కష్టతరమైంది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులు కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు.
ఒమర్ ఫరూక్‌తో సహా హురియత్ కాన్ఫరెన్స్ నేతలను గృహనిర్భంధంలో ఉంచారు. కాగా, కాశ్మీర్‌లో ఇప్పటికే జమ్ము, సాంబా, ఖతువా, రౌజౌరి, బదెర్వా పట్టణాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇదిలా ఉండగా, శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఎఎస్ఎస్) కార్యకర్తలు ఆందోళన ఉదృతం చేయడంతో ఫూంచ్‌లో గురువారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి.
|