వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తిరిగి భారత్‌ను ఆశ్రయించారు. గత నవంబరులో దేశాన్ని వీడి స్వీడన్ వెళ్లిన తస్లీమా శుక్రవారం కోల్‌కతా చేరుకున్నారు, విమానం నుంచి దిగీదిగగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. భారత్ ఆశ్రయంలోనే ఉండేందుకు తస్లీమాకు ఈ నెల ఆగస్టు 12వ తేదీ వరకే వీసా అనుమతి ఉంది.
అయినప్పటికీ భారత్ ఆశ్రయాన్ని కొనసాగించుకోవాలని తస్లీమా భావించారు. అయితే నస్రీన్ వీసాను పొడగించరాదని కొన్ని ముస్లీం సంఘాలు ఆందోళన చేపట్టడంతో పాటు మరి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య పశ్చిమబెంగాల్ నుంచి ఆమె స్వీడెన్‌కు తరలించబడ్డారు.
ఇదిలా ఉండగా.. తస్లీమా రచించి, వెలువరించిన 'లజ్జ', 'ద్విఖండిత' రచనల కారణంగా ఆమె వివాదాల్లో చిక్కుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆమెపై దాడులు జరగడం, వ్యతిరేకంగా ప్రదర్శనలు జరగడంతో ఆమె భారత్‌ను వీడిపోవాల్సి వచ్చింది. కాగా, భారత్ ఆశ్రయంలో తస్లీమా ఇక ఏ ప్రాంతంలో ఉంటారనే అంశంపై ఇంకా వివరాలు తెలియరాలేదు.
|