అల్లకల్లోలంగా మారిన కాశ్మీర్ లోయలో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేశారు. ఈ ప్రాంతంలోని పది జిల్లాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో కర్ఫ్యూను తొలగించారు. జమ్మూకాశ్మీర్‌లోని శ్రీ అమర్‌నాథ్ ఆలయానికి కేటాయించిన భూములను తిరిగి అప్పగించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీతో సహా, ఎస్ఏఎస్ఎస్, మరికొన్ని హిందూ సంస్థలు ఆందోళనకు శ్రీకారం చుట్టిన విషయం తెల్సిందే. ఇవి తీవ్రరూపం దాల్చడంతో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సాయుధ బలగాలను రంగంలోకి దించారు. అంతేకాకుండా.. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించారు. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో కాశ్మీర్ లోయల్లో నివశించే ప్రజలకు గృహాలకే పరిమితమయ్యారు. వర్తక వ్యాపారం పూర్తిగా స్తంభించి పోయింది. దుకాణాలను మూసివేశారు.
ఇదిలావుండగా స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలకు వ్యతిరేకంగా వేర్పాటువాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్‌లో గత సోమవారం నుంచి జరిగిన అల్లర్లలో 22 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. లక్షలాది రూపాయల మేరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో గురువారం నుంచి పరిస్థితులు చాలా మేరకు చక్కబడటంతో కర్ఫ్యూను తొలగించారు.
|