గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో సంభవించిన వరుస బాంబు పేలుళ్ళకు సంబంధించి కీలక నిందితుడిని ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేసింది. అలాగే మరో ఎనిమిది మంది సిమి సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ భద్రతలో నిమగ్నమైన ఏటీఎస్.. రాష్ట్ర రాజధాని లక్నోలోని పలు కీలక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ సమయంలో అహ్మదాబాద్ పేలుళ్ళకు కీలక పాత్ర పోషించిన సిమి నేత ముఫ్తీ అబ్దుల్ బషార్ ఈస్‌ఇలాహిని అరెస్టు చేశారు. ఈ అరెస్టు కోసం అహ్మదాబాద్ పోలీసులు యూపీ ఏటీఎస్‌కు తమ వంతు సహకారం అందించారు. బషార్‌కు తీవ్రవాద సంస్థతో దగ్గరి సంబంధాలు ఉండటమే కాకుండా జులై 26వ తేదీన జరిగిన బాంబు పేలుళ్ళలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
అలాగే.. బెంగుళూరు, మలేగాన్ బాంబు పేలుళ్ళతో సంబంధాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని మాత్రం దర్యాప్తు బృందం వెల్లడించడంలేదు. ఈ కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్టు పోలీసు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం అరెస్టు చేసిన బషార్ హైదరాబాద్‌లోని మదర్సాలో టీచర్‌గా పని చేశారు. వీరి తదుపరి లక్ష్యం వడోధరాను లక్ష్యంగా చేసుకున్నట్టు, ఇందుకోసం ముంబైలో పాత్రలను సైతం కొనుగోలు చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.
|