అమర్‌నాథ్ భూ కేటాయింపు రద్దుతో పెచ్చరిల్లిన అల్లర్ల నడుమ అమర్‌నాథ్ యాత్ర శనివారంతో ముగిసింది. రెండు నెలలపాటు సాగిన ఈ యాత్రలో 5.5లక్షల మంది యాత్రికులు పాల్గొనడం విశేషం. 160 సంవత్సరాల అమర్‌నాథ్ యాత్ర చరిత్రలో ఇంత ఎక్కువ సంఖ్యలో యాత్రికులు పాల్గొనడం ఇదే మొదటిసారి.
గత 2004లో నాలుగు లక్షల మంది అమర్ నాథ్ యాత్రలో పాల్గొన్నారు. భూమికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ లింగాన్ని మొదట ముస్లింలే కనుగొనడం గమనార్హం. కాగా.. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రలో జవాన్, బీఎస్ఎఫ్, పోలీసులతో పాటు మొత్తం 68 మంది సహజంగా ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు అమర్‌నాథ్ భూకేటాయింపు రద్దుపై తలెత్తిన అల్లర్లతో జూలై చివరి వారం నుంచి అమర్‌నాథ్‌కు వచ్చే యాత్రికుల సంఖ్య తగ్గింది. ఇదిలా ఉండగా, ఉత్తరాదిన పెద్ద ఎత్తున జరుపుకునే "రక్షా బంధన్" రోజునే ప్రతీ ఏడాది అమర్‌నాథ్ యాత్ర పూర్తికావడం విశేషం.
ఇకపోతే కాశ్మీరీయలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించే ‘చారీ ముబారక్’ను శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శనివారం ఉదయం యాత్ర ముగింపు సూచకంగా ఆఖరి సారి ప్రత్యేక ప్రధాన అర్చకుడు మహంత్ దీపేంద్ర గిరి కుంకుమ పూలతో పూజలు జరిపారు.
|