జార్ఖండ్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దుతును జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఆదివారం ఉపసంహరించుకోనుంది. తమ పార్టీ చీఫ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేందుకు వీలుగా జేఎంఎం ఈ నిర్ణయం తీసుకుంది. విధించిన గడువులోగా మధుకోడా తన పదవికి రాజీనామా చేయకుంటే మద్దతు ఉపసంహరిస్తామని జేఎంఎం నేతలు హెచ్చరించారు.
దీనిపై ఆదివారం రాత్రి గవర్నర్ సయ్యద్ సిబ్తీ రజీని కలిసేందుకు సోరెన్‌కు అపాయింట్‌మెంట్ కూడా లభించింది. గవర్నర్‌ను కలిసేముందు పార్టీ కేంద్ర కమిటీ, శాసనసభాపక్ష సమావేశాలలో మద్దతు ఉపసంహరణపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని పార్టీ కార్యదర్శి దిలీప్ ఛటర్జీ చెప్పారు. అయితే.. ఈ కీలకం నిర్ణయం తీసుకునే సమావేశానికి ఎమ్మెల్యేలలో పలువురు గైర్హాజరు కావాలని భావించారు.
దీన్ని నివారించేందుకు వీలుగా.. సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని పార్టీ విప్ జారీ చేసింది. ప్రతి ఒక్కరూ తమ అభ్యంతరాలు తెలిపేందుకు, ఇతరుల అభ్యంతరాలు తెలుసుకునేందుకు ఈ విప్ జారీ చేసినట్లు సోరెన్ కుమారుడు, పార్టీ విద్యార్థి విభాగం నేత హేమంత్ చెప్పారు.
మొత్తం 42 మంది సభ్యుల జార్ఖండ్‌లోని యూపీఏ ప్రభుత్వంలో 17 మంది సభ్యులున్న జేఎంఎం భాగస్వామి. కాంగ్రెస్ తొమ్మిది మంది, ఆర్జేడీ ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తున్నాయి. ప్రభుత్వంలోని ఎక్కువ మంది మంత్రులు మధుకోడాకు మద్దతు ప్రకటించడం గమనార్హం.
|