జమ్మూ- కాశ్మీర్‌లో చోటుచేసుకుంటున్న హింసను అంతమొందించేందుకు ప్రజలు సహకరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. జమ్మూలో శాంతిని నెలకొల్పడంతో పాటు యథావిధమైన పరిస్థితి కల్పించేందుకు ప్రజల సహకారం ఎంతగానో అవసరమని ప్రధాని వెల్లడించారు.
ఆర్థికశాస్త్ర నిపుణుడు సి. రంగరాజన్, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ తదితర మంత్రులతో సమావేశమైన అనంతరం ప్రధాని పార్లమెంట్ ఆవరణలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు, రాజకీయ పార్టీలు, ప్రజలు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.
జమ్మూ కాశ్మీర్ వివాదం కేవలం ఓ పార్టీకి మాత్రమే పరిమితం కాదని, అన్నీ రాజకీయ పార్టీలకు సొంతమైందేనని ప్రధాని గుర్తు చేశారు. మరోవైపు అమరనాథ్ వ్యవహారాన్ని మతం పేరిట ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన అన్నారు.
మతాలకు అతీతంగా వ్యవహరించడం ద్వారానే దేశంలో శాంతి నెలకొంటుందని, మతం పేరిట ప్రజలను విభజింప వద్దని ప్రధాని ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేశారు. జమ్మూ కాశ్మీర్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు ప్రజలతో పాటు విపక్షాలు కూడా చేయూత నివ్వాలని పేర్కొన్నారు.
|