జార్ఖండ్ ముక్తి మోర్ఛా (జేఎంఎం) మద్దతు ఉపసంహరించినా.. తమ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మధుకోడా ధీమా వ్యక్తం చేశారు. సభలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. మధు కోడా ప్రభుత్వానికి జేఎంఎం చీఫ్ సొరేనే మద్దతు ఉపసంహరిస్తూ గవర్నర్‌కు లేఖ సమర్పించిన విషయం తెల్సిందే.
దీంతో ముఖ్యమంత్రి గవర్నర్ సయ్యద్ సిబ్తెరజీని కలిసి, పరిస్థితిని వివరించారు. జేఎంఎం మద్దతు ఉపసంహరించడంతో పరిస్థితిని ఆయన సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బల సంఖ్యను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కాగా, ఈనెల 25వ తేదీ లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ సూచించారు. జేఎంఎంకు 17 మంది సభ్యుల మద్దతు ఉంది.
ఇదిలావుండగా.. జార్ఖండ్‌లో ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అందరికళ్లూ గవర్నర్ సిబ్తెరజీపైనే కేంద్రీకృతమై వున్నాయి. వేర్వేరు పార్టీల వారు సోమవారం ఉదయం ఆయన్ను కలిసి తమ వాదనలు వినిపించారు. బీజేపీ-ఎన్డీయే వర్గం, బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని జార్ఖండ్ వికాస్‌మోర్ఛా విడివిడిగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశాయి.
రాజ్‌భవన్ నుంచి బయటకు వచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీఎన్.సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇక ఎలాంటి అవకాశాలు లేవని, అందువల్ల సాధ్యమైనంత త్వరలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. మొత్తం 81 మంది సభ్యులు కలిగి జార్ఖండ్ అసెంబ్లీలో కమలనాథులకు 29 మంది, ఎన్డీయేకు నలుగురు సభ్యులున్నారు.
|