భారతీయ జనతా పార్టీ మరో మారు రథయాత్రకు శ్రీకారం చుట్టనుంది. గతంలో దేశవ్యాప్తంగా రథయాత్రను చేపట్టి రామజన్మభూమి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కమలనాథులు.. తాజాగా అమర్‌నాథ్ భూ వివాదాన్ని కూడా అదే స్థాయిలో ప్రచారం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కాశ్మీర్‌లో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై పార్టీ రథయాత్ర చేపట్టనుంది.
ఇందుకోసం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. గత శనివారమే అమర్‌నాథ్ యాత్ర ముగిసింది. అయితే అమర్‌నాథ్ భూవివాదాన్ని మాత్రం ఓ కీలకమైన అంశంగా మలిచి, దేశ ప్రజలందరి స్మృతిలో ఎప్పటికీ ఉండేందుకే ఈ యాత్రను చేపట్టాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం అగ్రనేతలంతా సోమవారం సమావేశమయ్యారు.
అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ లేదా అగ్రనేత అద్వానీ ఈ దేశవ్యాప్త రథయాత్రను చేపడతారని భావిస్తున్నారు. అమర్‌నాథ్ భూవివాదం కూడా అయోధ్య అంశంలా భావిస్తున్నారు. జాతీయవాదులకు, కాశ్మీర్ వేర్పాటు వాదులకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. దేశసమైక్యత కోసం మేం రథయాత్ర నిర్వహిస్తే నష్టం వాటిల్లబోదని స్పష్టం చేశారు.
|