తమిళనాడు రాష్ట్రానికి రాజధాని నగరమైన చెన్నై నగరానికి మూడు శతాబ్ధాలకు పైగా చరిత్ర ఉంది. స్వాంతంత్రానికి పూర్వం వ్యాపార అభివృద్ధి కోసం బ్రిటీష్ వారి కాలంలో అభివృద్ధి చేయబడిన ఈ ప్రాంతం అనతికాలంలో ఓ మహా నగరంగా రూపుదిద్దుకుంది.
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించాక ఆంధ్ర, తమిళనాడులకు ఉమ్మడి రాజధానిగా వెలుగొందిన ఈ నగరం అప్పట్లో మద్రాసు అనే పేరుతో పిలబడేది. అయితే ఉమ్మడి రాష్ట్రం నుంచి భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం వేరు పడ్డ తర్వాత ఈ మద్రాసు నగరం తమిళనాడు రాష్ట్ర రాజధానిగా ఏర్పాటైంది. అయితే మద్రాసుగా పిలవబడుతూ వచ్చిన ఈ నగరం గత కొద్ది ఏళ్లుగా తన పూర్వపు పేరైన చెన్నై పేరుతోనే పిలబడుతుండడం విశేషం.
ఇన్ని ప్రత్యేకతలను కలిగిన ఈ చెన్నై నగరం ప్రస్తుతం 369 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఓ సముద్ర తీర గ్రామంగా ఉన్న చెన్నై నేడు ఓ మహా నగరంగా రూపాంతరం చెందిన పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు మనకు గోచరమవుతాయి. భారతదేశంలో తమ వ్యాపార అభివృద్ధి కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేసిన రోజుల్లో వారి దృష్టి తీర గ్రామమైన ఈ చెన్నై నగరంపై పడింది.
తమ వ్యాపార అభివృద్ధికి అనువైన ప్రదేశంగా చెన్నై గ్రామాన్ని ఎంచుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ గ్రామాన్ని 1639లో కొనుగోలు చేసింది. ఇందుకోసం అప్పటి చెన్నై ప్రాంతానికి హక్కుదారులైన నాయక్కర్ పాలకుల నుంచి కొనుగోలు చేయబడినట్టు ఓ ఒప్పంద పత్రం సంతకం చేయబడింది. దీని ప్రకారం 1639 జులై 22వ తేదీన చెన్నై ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ సొంతమైంది.
అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ భారత ప్రతినిధి ఫ్రాన్సిస్ డై సమక్షంలో ఈ ఒప్పందం ఖరారైంది. అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడి సముద్ర తీరానికి దగ్గర్లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించింది. నేడు ఈ కోట నుంచి సముద్రం చాలా దూరంలో ఉన్నా అప్పట్లో కోటకు చాలా సమీపంలో సముద్రం ఉండేది. అలాగే అప్పట్లో సముద్రానికి సమీపంలో ఓ సహజసిద్ధ ఓడరేవు కూడా ఉండేది.
|