నానో కార్ల తయారీ ఫ్యాక్టరీని పశ్చిమ బెంగాల్ నుంచి వేరో రాష్ట్రానికి తరలిపోదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. సింగూర్ నుంచి టాటా నానో కార్ల ఫ్యాక్టరీని వేరే చోటికి మార్చే ప్రశ్నేలేదన్నారు. దీనిపై ఆయన ఆదివారం మాట్లాడుతూ... టాటా ఫ్యాక్టరీ సింగూర్‌ను వేరే చోటకి వెళ్లదు. ఒక వేళ టాటా గ్రూపు ఛైర్మన్ మరో ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదు. ఆయన సింగూర్‌లోనే ప్లాంట్ నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని భట్టాచార్య అన్నారు.
కాగా, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం నుంచి చేపట్టిన నిరవధిక ఆందోళన దృష్ట్యా రెండు వేల మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సిబ్బందిని సింగూర్‌లో మొహరించారు. ఆందోళన ప్రశాంతంగా ముగుస్తుందని తాము భావిస్తున్నాం. ఈ మేరకు స్థానిక నేతలు కూడా హామీ ఇచ్చారు. ఘర్షణలు తలెత్తకుండా చూస్తామని చెప్పారని ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అశోక్ మోహన్ చక్రవర్తి తెలిపారు.
అయితే.. ఆందోళనకారులు ఫ్యాక్టరీ ప్రహరీ గోడను కూల్చివేసి లోనికి వెళితే ఏమి చేస్తారని ప్రశ్నించగా.. స్థానిక నేతలు తమ మాటకు కట్టుబడుతారని నమ్ముతున్నాం. ఎవ్వరూ కూడా హింసాత్మక చర్యలకు దిగబోరనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. అయితే ముందస్తు చర్యగా ప్లాంట్‌కు వెళ్లే అన్ని మార్గాలను మూసి వేశారు. ప్లాంట్ కోసం సేకరించిన భూముల్లో ఉన్న 400 ఎకరాల వ్యవసాయ భూములను తిరిగి అప్పగించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
|