అణు ఒప్పందంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఓ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల రెండు రోజుల పాటు వియన్నాలో జరిగిన చర్చల సందర్భంగా అణు సరఫరా దేశాల బృందం ముసాయిదా సవరణకు కొన్ని సభ్య దేశాలు పట్టుబట్టిన నేపథ్యంలో.. కేంద్రం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ ముసాయిదాను విశ్లేషించడానికి, అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
అణు ఒప్పందంపై ప్రధానమంత్రి ప్రత్యేక రాయబారి శ్యాంశరణ్, విదేశీ వ్యవహారాల శాఖ, అణుశక్తి సంఘం ఉన్నతాధికారులతో ఆయన గంటసేపు చర్చించారు. ఇందులో వియన్నాలో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలు, ఎన్‌ఎస్‌జీ పట్టుపడుతున్న ఆంక్షలు తదితర అంశాలపై చర్చించారు.
ఎన్‌ఎస్‌జీ డ్రాఫ్ట్ సవరణపై విదేశాంగ శాఖ కార్యదర్శి శివశంకర్ మీనన్ అమెరికా అధికారులతో త్వరలో వాషింగ్టన్‌లో భేటీ కానున్నారు. ఈ సమావేశానంతరం కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ... భారతీ జనతా పార్టీ సీనియర్ నేతలైన జశ్వంత్ సింగ్, అరుణ్ శౌరిలతో చర్చించారు.
|