జార్ఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సోరేన్ కూడగట్టుకున్నారు. మొత్తం 82 మంది సభ్యులు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో సోరేన్‌కు 42 మంది ఎమ్మెల్యేల మద్దతు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ సయ్యద్ సిబ్తీ రజేకు లేఖ సమర్పించారు.
దీంతో ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ జేఎంఎం చీఫ్ సోరేన్‌కు ఆహ్వానం పలికారు. గవర్నర్‌కు లేఖ సమర్పించిన సమయంలో ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ సీనియర్ నేత జయప్రకాష్ నారాయణ్, మాజీ ముఖ్యమంత్రి మధు కోడాలు ఉన్నారు.
ఈనెల 17వ తేదీన 17 మంది సభ్యులు కలిగిన జేఎంఎం మద్దతు ఉపసంహరించడంతో జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దీంతో 25న బలపరీక్షకు గవర్నర్ ఆదేశించగా, తగిన బలం లేక పోవడంతో బలపరీక్షకు రెండు రోజుల ముందుగానే సీఎం పదవికి రాజీనామా చేశారు.
|