పార్లమెంట్ సమావేశాలు అక్టోబరు 17వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. బహుశా 14వ లోక్‌సభ చిట్టచివరి సమావేశాలు ఇవే కావచ్చు. అక్టోబరు 17వ తేదీ నుంచి నవంబరు 21వ తేదీ వరకు జరిగే ఈ సమావేశాల్లోనే భారత్-అమెరికా అణు ఒప్పందం అమలుకు సంబంధించిన అన్ని రకాల చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష కోసం గత జులై నెలలో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెల్సిందే. వచ్చే అక్టోబరులో మరో ఐదు వారాల పాటు సమావేశాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి వాయలార్ రవి మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వం వాయిదా వేయలేదు. ఇప్పటికే ప్రారంభమైన సమావేశాల కొనసాగింపుగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అయితే సమావేశాలే 14వ లోక్‌సభ చివరి సమావేశాలా అని ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పకుండా దాటవేశారు.
|