బీహార్ వరద బాధితులకు రూ. 1000 కోట్ల తక్షణ సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నట్లు దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ప్రకటించారు. దీనితో పాటు వరద బాధితులకు 1.25 లక్షల టన్నుల ఆహారపు ధాన్యాలను కూడా అందజేయనున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు.
నేపాల్‌లోని కోసి నదిపై ఉన్న ఆనకట్ట తెగి ప్రవాహం తన దిశను మార్చుకుని బీహార్‌ను ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరద ఉధృతిలో బీహార్‌లోని ఆరు జిల్లాలు నీట మునిగాయి. పన్నెండు లక్షల మంది నిరాశ్రయులు కాగా, ఇప్పటికే 55 మంది మృతి చెందారు. ఇంకా మరణపు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో సుపాల్ సహర్సా, అరారియా మాధేపుర వంటి వరద బాధిత ప్రాంతాలను ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా గురువారం సందర్శించారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్, లాలూ ప్రసాద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్‌లు కూడా వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు.
ఇంకా వరద బాధితులను రక్షించేందుకు అవసరమైన సహకారాన్ని కేంద్రం చేస్తుందని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. వరద ముంపులో చిక్కుకున్న బాధితులను రక్షించేందుకు సైనిక సహకారాన్ని కూడా అందజేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
|