జైపూర్ బాంబు పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిని సాక్షి గుర్తుపట్టాడు. జైపూర్ బాంబు పేలుడులో ప్రత్యక్ష సాక్షిగా పరిగణించే ఓ వ్యక్తి గురువారం ఈ పేలుళ్ల ఘటనకు షాబాజ్ అహ్మద్ అనే వ్యక్తి ప్రమేయమున్నట్లు నిర్ధారించాడు.
దీనితో షాబాజ్ హుస్సేన్ అలియాస్ షాబాద్ అహ్మద్ అనే సైబర్ కేఫ్ యజమానికి బాంబు పేలుళ్లకు సంబంధమున్నట్లు తెలియవచ్చింది. జైపూర్ పేలుళ్లకు ముందు ఇదే సైబర్ కేఫ్ నుంచి అనుమానస్పద ఇ-మెయిల్స్‌ను ఇతను పంపినట్లు విచారణలో తేలింది.
దేశంలో చోటు చేసుకున్న నాలుగు బాంబు పేలుళ్ల సంఘటనల్లో షాబాజ్ ప్రమేయముందని రాజస్థాన్ క్రైం బ్రాంచ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇతనిపై వివిధ సెక్షన్ల కింద శిక్షపడే అవకాశముందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, షాబాజ్‌ను యూపీ ఎటిఎస్ సిబ్బంది ఆగస్టు 25వ తేదీన అరెస్టు చేశారు. లక్నోలోని అమీనాబాద్ ప్రాంతంలో షాబాజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే గత మే 13వ తేదీన సంభవించిన జైపూర్ బాంబు పేలుళ్లలో 64మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
|