వివాదాస్పద సింగూర్ సమస్యపై సమరస పరిష్కారానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. బెంగాల్ గవర్నర్ గాంధీతో చర్చలు జరిపేందుకు తమ పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత పార్థా ఛటర్జీ నేతృత్వంలోని ప్రతినిధి ఇప్పటికే కోల్‌కతాలో ఉన్నట్టు ఆమె చెప్పారు.
ఆమె శుక్రవారం సింగూర్‌లో మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారిపై గత 13 రోజులుగా చేస్తున్న ఆందోళన, ధర్నాను విరమించుకోవాలని గవర్నర్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిని తమ పార్టీ కార్యకర్తలు దిగ్భందం చేయలేదన్నారు. జాతీయ రహదారిపై వాహన రాకపోకలను అనుమతించాల్సిన, సరి చేయాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు.
తమ పార్టీ కార్యకర్తలు వాహన రాకపోకలను అడ్డుకుంటున్నారని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. అలాగే సింగూర్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర గవర్నర్ గాంధీ మధ్యవర్తిత్వం వహించేందుకు ముందుకు రావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఈ అంశంపై సామరస్య పరిష్కారానికి అవసరమైన అన్ని రకాల సహకారాలు అందిస్తుందన్నారు. దీనిపై సింగూర్ పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జ్ ప్రియభారత్ భక్షి మాట్లాడుతూ.. జాతీయ రహదారిలో ఒక మార్గంలో మాత్రమే వాహన రాకపోకలను అనుమతించి, పోలీసు బలగాలు బందోబస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.
|