సింగూర్ సమస్యకు పరిష్కార మార్గం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ మధ్యవర్తిత్వం ఫలించింది. ఇరు వర్గాలతో ఆయన శుక్రవారం జరిపిన చర్చలు ఆశావహంగా ముగిశాయి. సింగూర్‌లో టాటా యాజమాన్యం తలపెట్టిన నానో కార్ల ఫ్యాక్టరీకి తృణమూల్ కాంగ్రెస్ అడుగడుగునా అడ్డు తగులుతున్న విషయం తెల్సిందే.
ఈ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించిన 1600 ఎకరాల భూముల్లో ఉన్న 400 ఎకరాల వ్యవసాయ భూములను తిరిగి రైతులకు అప్పగించాలన్నది తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. దీనికి బెంగాల్ ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయినప్పటికీ.. ప్రభుత్వ అండతో టాటా యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణంపై సుమారు రూ.1700 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టింది. అయితే తృణమూల్ కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన మరింత ఉధృతం చేసింది.
ఫ్యాక్టరీ ప్రధాన ద్వారం వద్ద గత 14 రోజులుగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిరవధిక ధర్నా చేస్తున్నారు. దీంతో టాటా యాజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అర్థాంతరంగా నిలిపివేసి, ఉద్యోగులను వెనక్కి పిలిపించింది. ఈ హఠాత్ పరిణామంతో సమస్య జఠిలంగా మారింది. గవర్నర్ మధ్యవర్తిత్వం వహించి, సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలని బెంగాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో ఆయన రంగంలోకి దిగి ఇరు వర్గాలతో చర్చలు జరిపారు.
ఈ చర్చలకు తృణమూల్ తరపున ఆ పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత పార్థ చటర్జీ నాయకత్వం వహించారు. తొలిదశ చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిష్కారం దిశగా చర్చలు సాగుతున్నాయి, రేపు (శనివారం) కూడా ఈ చర్చలు సాగుతాయి' అని క్లుప్తంగా సమాధానం ఇచ్చారు.
అలాగే ప్రభుత్వం తరపున పరిశ్రమల శాఖామంత్రి నిరుపమ్ సేన్, పంచాయతీ శాఖ మంత్రి సూర్యకాంతమిశ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమిత్ కిరణ్ దేవ్, హోం, వాణిజ్య శాఖల కార్యదర్శులు అశోక్‌మోహన్ చక్రవర్తి, సవ్యసాచి సేన్‌లు పాల్గొన్నారు.
|